Archive for May, 2012

ప్రవేశ క్రమంలో పాత్రలు –

టి.వి. యాంకర్ సోది
పాలక పక్ష ప్రతినిధి బాకా
ప్రతిపక్షనాయకుడు కసి
రైతు
రైతుభార్య
రైతు కొడుకు
కొడుకు స్నేహితుడు
పోలీసులు
ఆందోళనకారులు

సన్నివేశం – 1
(వన్ టి.వి, స్టూడియో.. టి.వి.యాంకర్ సోది పాలక పక్ష ప్రతినిధి బాకా కూర్చొన్నారు.. వారగా ఉన్న టి.వి. షేప్ లో ప్రతిపక్షనాయకుడు కసి ఉన్నాడు..).
సోది – ప్రేక్షక దేవుళ్లకు సోమిదం దినకర్ ఎలియాస్ సోది నమస్కారం.. ఈ నాటి సోది తో శుభోదయం కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం.. పాల ధరను లీటర్ కు రెండు రూపాయాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షం ఆందోళనకు పిలుపు నిచ్చింది… ఈ నిర్ణయం పూర్వాపరాలు, ప్రతిపక్షం ఇచ్చిన ఆందోళన పిలుపు పై ఈ రోజు చర్చ జరుగుతోంది.. ఈ చర్చలో మనతో పాల్గొనడానికి పాలక పక్ష ప్రతినిధి, బాకా గా ప్రసిధ్ధులైన బాగానపల్లి కాశీనాధ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు.. ప్రతి పక్ష నాయకులు, కసి గా ప్రసిధ్దులైన కనకరాజు సిధ్ధాంతం గారు ఢిల్లీ నుండి టెలిఫోన్లో మనకు అందుబాటులో ఉన్నారు.. చర్చలోకి వెళ్ల డానికి ముందుగా ఒక ఎస్.ఎం.ఎస్ ప్రశ్న.. మా ప్రశ్న పాల ధర పెంపు నిర్ణయం పై ప్రతిపక్షం ఇచ్చిన ఆందోళన పిలుపు సమంజసమని మీరు అనుకుంటున్నారా.. అవును ఐతే వై అని కాదంటే ఎన్ అని 11 22 33 44 55 నంబర్ కి ఎస్.ఎం.ఎస్ చేయడి.. ఇప్పుడొక వాణిజ్య విరామం.. (రెండు సెకన్ల అనంతరం..) విరామం తరువాత ఈ రోజు సోది తో శుభోదయం కార్యక్రమానికి మీకందరికీ పునః స్వాగతం.. చర్చలోకి వెళ్లే ముందు మన ఎస్.ఎం.ఎస్ ప్రశ్నకు వచ్చిన స్పందన చూద్దాం.. 45 శాతం అవునని, 55 శాతం కాదని ఎస్.ఎం.ఎస్. పంపేరు.. ఇక చర్చ లోకి వెళదాం..నమస్కారం కాశీనాధ్ గారు..
బాకా – నమస్కారం దినకర్ గారు..ఈ కార్యక్రమం చూస్తున్న అశేష ప్రజానీకానికి నమస్కారం..
సోది – చెప్పండి కాశీనాధ్ గారు.. ప్రభుత్వం పాల ధర పెంచడానికి ఎందుకు పూనుకొంది ..
బాకా – ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక విషయం మనవి చేసుకోవాలి.. మరి, ప్రజాహితమే మా ధ్యేయం.. రాష్ట్ర సర్వతో ముఖాభివృధ్ది మా ఆశయం.. దేశంలోనే కాదు మరి యావత్ప్రపంచంలోనే మన రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచాలని మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆశయం..ఆ ఆశయ సాధనకు ఆయన అహర్నిశం శ్రమిస్తున్నారు.. మరి వారి అవిరామ కృషిని, రాష్ట్రం మరి మన ముఖ్యమంత్రిగారి నేతృత్వంలో సాధిస్తున్న కృషిని ప్రజలకు తెలియ చేయవలసిన భాద్యత మరి మీ పత్రికల మీద, మీడియా మీద ఉందన్న సంగతి మరి నేను మీకు వివరించ వలసిన అవసరం లేదు.. మరి..ఈ రోజు మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందుకు పత్రికా ముఖంగా, మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తీసుకు వెళ్లే వారి మద్దతును కోరుతున్నాను..
సోది – అందుకే కదా.. ఈ రోజు ఈ చర్చ చేబడుతున్నాం.. సరే.. మీతో మాట్లాడే ముందు ఒక సారి ప్రతిపక్ష నేత కసి గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం.. హల్లో కనకరాజు గారు..
కసి – హల్లో..
నారద – నమస్కారం… కనకరాజుగారు
కసి – దినకర్ గారు.. మీకు, టి.వి. ల ముందు కూర్చొన్న అశేష ప్రజానీకానికి నా నమఃసుమాంజలులు..
నారద – కాశీనాధ్ గారి మాటలు విన్నారు కదా.. మీ ప్రతిస్పందన తెలియ చేయండి..
పా.ప. కసి – మన రాజ్యాంగ కర్తలు ప్రజాస్వామ్యానికి అత్యంత విలువ నిచ్చేరు.. ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కొరకు పాటుపడేదే ప్రజాస్వామ్యం.. పోతే.. ఈ సారి ఎన్నికలలో ప్రజలు మాకు అధికార పగ్గాలు ఇవ్వలేదు.. ప్రతిపక్షంలో ఉండమన్నారు..మహద్భాగ్యం..ప్రజల తీర్పు మాకు శిరోధార్యం.. ఈ వ్యవస్ధలో అధికార పార్టీకి మించిన భాద్యత ప్రతిపక్షానికి ఉంది.. ప్రతిపక్షంగా మరి మా కర్త్యవాన్ని మేం నిర్వహిస్తున్నాము..
సోది – మీరు చెప్పింది బాగానే ఉంది.. పాయంట్ లోకి రండి..
కసి – వస్తున్నా.. పోతే, ఎన్నో ఆశలతో ప్రజలు ముచ్చటపడి అధికారంలోకి తీసుకువచ్చిన పాలక పక్షం వారు ప్రజల ఆశలను సమూలంగా నాశనం చేసేరన్న విషయాన్ని సవినయంగా నేను మీ ద్వారా ప్రజలందరికి మనవి చేసుకుంటున్నాను.. ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో ఘోరంగా, పూర్తిగా విఫలమైంది..
బాకా – (కసి మాటలు పూర్తి కాకుండనే ఓవర్ లాపింగ్..) రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ని ప్రతిపక్షం వారు చూడడం లేదు.. వాళ్లు కళ్లున్న కబోదులు.. ప్రజలలో మాకు మా పార్టీకి లభిస్తున్న ఆదరణ, మరి మాకు పెరుగుతున్న జనాదరణ, మరి మాకు పెరుగుతున్న అభిమానం చూసి వాళ్లు ఓర్చుకోలేక ప్రభుత్వం మీద బురద జల్లే పనికి పూనుకున్నారు..
కసి – (బాకా మాటలు పూర్తి కాకుండనే ఓవర్ లాపింగ్..) ఏమిటండీ రాష్టం సాదించిన ప్రగతి.. కల్తీ విత్తనాలతో దిగుబడి రాక, గిట్టు బాటు ధరలు లభించక పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నల చావులలోనా..నేసిన బట్ట అమ్ముడు కాక, అప్పులు తీర్చలేక వారు నేసిన తాళ్లతో ఉరితీసుకున్న చేనేత కార్మీకుల చావులలోనా..ఈ ప్రభుత్వంలో అవినీతి, ఆశిత్రపక్షపాతం అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయాయి. ఒక వైపు గుండాయిజం కరాళ నృత్యం చేస్తూ ఉంటే మరోవైపు పోలీసుల అకృత్యాలు విలయ తాండవం చేస్తున్నాయి..నో లా అండ్ ఆర్డర్ ఎటాల్..
సోది – మనం పాయంట్ నుండి డీవియేట్ అవుతున్నాం..బాకా గారు..మీరు చెప్పండి..
బాకా – మానవ ప్రయత్నానికి మరి, దైవ బలం కలిసి రావాలి..సముద్రం తీర ప్రాంతాలు మరి అల్పపీడనానికి లోనై వరదల్లో మునుగుతూ ఉంటే మరి మెట్ట ప్రాంతాలలో అనావృష్టి పీడిస్తోంది.. మొన్న కోస్తా జిల్లాలలో మరి వరదల వలన అపార పంట నష్టం, పశు నష్టం జరిగింది.. జన నష్టాన్ని నివారించ కలిగినా మరి, రైతన్నకు జరిగే ఆర్ధిక నష్టాన్ని నివారించ లేక పోయాము.. వారికి మనం మన వంతు సాయం అంద చేయాలి..
కసి – (బాకా మాటలు పూర్తి కాకుండనే ఓవర్ లాపింగ్..) ఉత్తర కోస్తాలో విపరీతంగా వరదలు సంభవించి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే, రోమ్ నగరం తగలబడుతూ ఉంటే ఫిడేల్ వాయించుకొన్న నీరో చక్రవర్తి లా మన ముఖ్యమంత్రి విదేశి విహారాలు చేసాడు.. పోతే, పంటనష్టంతో పశునష్టంతో సర్వసం కోల్పోయిన బక్క రైతుకు ప్రభుత్వం ఏమి చేసిందని, నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.. పోతే, మెట్ట ప్రాంతంలో వర్షాభావం వలన నిటి ఎద్దడి ఏర్పడింది.. ఈ నీటి ఎద్దడి తీర్చడానికి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుందా అదీ లేదు.. ప్రభుత్వం ఏమి చేస్తోంది..కళ్లప్పగించి విడ్డూరం చూస్తోంది.. కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తోంది.
సోది – మనం పాయంట్ నుండి డీవియేట్ అవుతున్నాం..బాకా గారు..ప్లీజ్..
బాకా – మరి పాడి పరిశ్రమ పై ఈ విపత్కర పరిస్ధితుల ప్రభావం చాలా పడింది.. మరి, పాల సేకరణ అత్యంత కష్టతర మవుతోంది..అందు చేత, బక్క చిక్కిన రైతుకు వెసులు బాటుగా ఉండే విధంగా మరి పాలసేకరణధర లీటర్ కు యాభై పైసలు పెంచాలని మరి ప్రభుత్వం నిర్ణయించిదని తెలియ చేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను..
కసి – ఆహా.. ఏమి వితరణ.. కొంపాగోడూ, గొడ్డూగేదే, అన్నీ కోల్పోయిన రైతుకు ఇచ్చే సాయం పాల సేకరణ ధర లీటర్ కు యాభై పైసలు పెంచడం..ఇది కేవలం కంటి తుడుపు చర్య..పోతే, పాల సేకరణ ధర కనీసం రెండు రూపాయలు పెంచాలి..పోతే పంట పోయిన ప్రతి ఎకరాకి కనీసం లక్షరూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను..
బాకా – రైతన్నను ఆదుకోడానికి మేం తీసుకొన్న చర్యలు ప్రజల మెప్పును పొందుతాయని మరి మాకు తెలుసు.. ఐతే మాప్రస్తానం ఇంతటితో ఆగదు.. చేయవలసింది ఎంతో ఉంది..రైతు సౌభాగ్యమే మేము కోరుకునేది,, రైతన్నకు మరింత ఊరట కావాలి..
కసి – (బాకా మాటలకు అడ్డు వస్తూ) )ఏమిటండీ ఇంకా చేసేది.. పది మందికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రా అని ఘోషిస్తున్నాడు.. మరింతగా అలో లక్షణా అని ఏడ్చేటట్టు చేయడమే ప్రభుత్వ ధ్యేయంగా కనబడుతోంది..
బాకా – ఏమిటండీ నన్ను పూర్తిగా మాట్లాడ నివ్వరా.. మీరు మాట్లాడు తున్నప్పుడు నేను అడ్డు వచ్చేనా..
సోది – కసి గారూ..ప్లీజ్,,వారి మాట పూర్తి చేయనీయండి..టైం ఐ పోతోంది..
బాకా – పాడి పరిశ్రమాభి సంస్ధ ఆర్ధిక పరిస్ధితి అంత బాగా లేదన్న విషయం మీకందరికీ తెలియనది కాదు.. అంతే కాక, కేంద్రప్రభుత్వం పెంచిన డీజిల్ ధర, దానితో పెరిగిన రవణా వ్యయం సంస్ధ ఆర్ధిక వ్యవహారాలపై మరింత ప్రభావం చూపుతోంది.. అందుచేత, పాల సేకరణ ధర అదనపు భారాన్ని సంస్ద భరించే స్ధితిలో లేదు.. అందువలన పాల విక్రయ ధర లీటరుకు రెండు రూపాయాలు పెంచుతున్నాము..
కసి – భేష్.. ఇదండీ ప్రభుత్వం సాధించే అభివృధ్ది.. అసలే కరువు రోజులు.. సామాన్యుడి బ్రతుకు దుర్భరంగా ఉంది.. రోజు గడవడమే కష్టం గా ఉంది.. అటువంటిది పాల ధర పెంపు మూలిగే నక్క మీద తాడిపండు పడడం వంటింది కాదా.. పోతే, ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు సేవించే పాల ధరను పెంచడం ఎంత వరకు సమంజసం.. అదీ కాక పసి పాప దగ్గరనుండి వయసుడిగిన వృధ్దుల వరకూ కావలిసిన పాలధర పెంచడం సహించరానిది.. అందుకే మా ఆందోళన..
బాకా – ఇది మేము తప్పని సరి పరిస్ధితిలో తీసుకున్న నిర్ణయం.. ఇది సామాన్యుడి మీద అదనపు భారమవుతుందన్నది మా దృష్టి ఫథంలో ఉంది.. కానీ అసహాయత.. ప్రతి పక్షం ఇలా ఆందోళనలు దిగడం ప్రజలను అయోమయం లోకి నెట్టడమే..
కసి – ఏమిటండీ అసహాయత.. అంతర్జాతీయ బ్యాంక్ కు అమ్ముడై పోవడమా.. పోతే, మన ముఖ్యమంత్రి ఆ బ్యాంక్ నౌకరులా ప్రవర్తిస్తున్నాడు.. అభివృధ్ది కోసం అప్పు తీసుకోవచ్చు.. కానీ అంత మాత్రాన మన మానాభి మానాలు వారి వద్ద తాకట్టు పెట్టుకోవలిసిన అవసరం లేదుగా..ఈ పాల ధర పెంపు వెనక బ్యాంక్ హస్తం ఉంది.. బ్యాంక్ విధించే షరతులలో ఇది ఒకటి..
బాకా – ప్రభుత్వం అనేక అభివృధ్ది, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది.. మరి వాటికి నిధులు కావాలి.. పన్ను భారం మోపలేము..అదీ కాక అదిక మొత్తం కావాలంటే బ్యాంక్ లను, ఇతర ఆర్ధిక సంస్ధలను ఆశ్రయింపక తప్పదు..మనం అప్పుకోసం వెళ్లినప్పుడు మరి వారు కొన్ని షరతులు విధించడం సహజమే కదా.. ఐతే ఆ షరతులు మనం తీసుకొన్న మొత్తం ఏ కార్యక్రమం కోసం తీసుకొన్నామో దానికే వినియోగిస్తున్నామనే నిర్దారణకు మరో మాటలో అప్పుతీసుకున్న మొత్తం దుర్వినియోగం కాకుండా చూడడానికే..
కసి – అప్పు తీసుకున్న తరువాత చెల్లించడం మన పని.. అప్పు తీసుకొన్న మొత్తం జాగ్రత్తగా ఖర్చు చేయడం మన భాద్యత, విజ్ఞత.. దానికి వారి పెత్తనం ఏమిటి.. అప్పుని తిరిగి జాగ్రత్తగా తిరిగి చెల్లిస్తున్నామా లేదా అన్నది ఒక్కటే వారికి కావలిసింది.. అంతే కాని మన రోజువారి కార్యక్రమాలలో వారు కలగ .చేసుకోవలిసిన అవసరం వారికి ఏమిటి.. ఇది ప్రభుత్వం వారికి ఇచ్చిన అలుసు..
బాకా – ఎడదిడ్డం అంటే పెడదిడ్డం అన్నట్టుంది వారి వరస.. వితండ వాదం కాదు.. యదార్దం దృష్టిలో పెట్టుకోవాలి..
కసి – యదార్ధం మాకు తెలుసండీ.. మేం అధికారంలో పదేళ్లు ఉన్నాం..మా నాయకుడు రెండు టర్మ్ లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు..
బాకా – పాత విషయాలు గుర్తుకు తెచ్చుకోండి.. మీరు అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయి బ్యాంక్ నుండి అప్పు తేలేదా.. వారి షరతులకు తలొగ్గ లేదా..
కసి – నిజమే.. కాని మేం ఇంతలా అంతర్జాతీయ బ్యాంక్ వారి అడుగులకు మడుగులు వత్త లేదు.. వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాం.. మా పాలనలో వారి ప్రమేయం లేదు..
బాకా – ఎందుకు లేదు.. పెన్షనర్లకు డి.ఎ. ఆపింది ఎవరో.. అది అనుత్పాదిత వ్యయమని అంతర్జాతీయ బ్యాంక్ సలహా కాదా.. మేం వారితో పోట్లాడి తిరిగి నాలుగు లక్షల పైచిలుకు పెన్షనర్ల ముఖాల మీద చిరునవ్వు తెప్పించాం..
సోది – మళ్లీ మనం డీవియేట్ అవుతున్నాం…
బాకా – పాలధర పెంపు స్ధానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తీసుకొన్న నిర్ణయం.. దీనికి అంతర్జాతీయ బ్యాంక్ కి ఎటువంటి సంబంధం లేదు.. ఇది ప్రతిపక్షాల వారి అభూత కల్పన.. పెరిగిన డీజిల్ విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాం.. వారి నిర్ణయాన్ని పునరాలోచించుకోమని వారిని కోరతాం…
కసి – డీజిల్ ధర పెరిగిందన్నది సాకు మాత్రమే..పోతే, కేంద్రంలో ఉన్నది వీరి భాగస్వామ్యంతో నడిచే ప్రభుత్వమే.. కేంద్రం తో చర్చించడమేమిటి.. వీరు కేంద్రప్రభుత్వం నుండి వైదొలిగితే కేంద్ర ప్రభుత్వం పేక మేడలా కూలిపోతుంది.. అటువంటిదేదో చేస్తామని కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తీసుకు రావచ్చు కదా..అదీ కాక, రేపు కేంద్రం ఏదో పరిస్ధితకి తలొగ్గి డీజిల్ ధర తగ్గిస్తే.. అది జరగని పని అనుకోండి..జస్ట్ హైపోధిటికల్.. కానీ, ఎనిమిదో వింత లా జరిగితే ఈ ప్రభుత్వం పాల ధర తగ్గించుకుంటుందా అని నేను సూటిగా ప్రశిస్తున్నాను.. నాకు తెలుసు, నా ఈ ప్రశ్నకు, పాలక పక్షం వారి దగ్గర సమాధానం లేదు..
బాకా – ఒక వైపు హైపోతిటకల్ అంటూనే వారి ప్రశ్నకు మా వద్ద సమాధానం లేదంటున్నారు.. నిజమే.. పిచ్చి పిచ్చి ప్రశ్నలకు మావద్ద సమాధానం లేదు.. వారి మానసిక స్ధితి ఒక సారి పరీక్షించుకుంటే మంచిది.. వారితో నాకున్న స్నేహాన్ని బట్టి నేను ఈ సలహా ఇస్తున్నాను.. మేము తీసుకొన్న నిర్ణయం మరి తప్పని సరి పరిస్ధితులలో తీసుకొన్నది.. గత్యంతరం లేని పరిస్ధితులతో ఈ పాల ధర పెంపుకు పూనుకోవలసి వచ్చింది.. ప్రజలు సహృదయతతో మమ్మల్ని అర్ధం చేసుకుంటారని మా నిర్ణయాన్ని ఆమోదిస్తారని మాకు తెలుసు..
కసి – అస్సలు ఆమోదించరు.. ఇటువంటి అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటే ప్రజలే బుధ్ధి చెబుతారు..
బాకా – మా సంగతి సరే.. ముందు ప్రజలు వాళ్లకు బుధ్ది చెప్పేరు కదా.. గతం నుండి వారు ఏమీ నేర్చుకున్నట్లు కనబడదు..మా నిర్ణయం వెనుక ఉన్న పూర్వాపరాలను మీ ద్వారా ప్రజనీకానికి తెలియ చేసేను.. ప్రతి పక్షాలు ఇకనైనా బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలి..
కసి – అసలు ఈ రాష్ట్రప్రభుత్వం, కేంద్రం లో వీరి భాగస్వామ్య ప్రభుత్వం పగ్గాలు చేబట్టిన తరువాతే ప్రజల బ్రతుకులు దుర్భరంగా మారేయి.. వీరి పాలన నానాటికి తీసికట్టు నాగంభట్లు అన్న చందం గా సాగుతోంది.. ఇందులో అతిశయోక్తి లేశమంతైనా లేదు.. తక్షణం దీన్ని అడ్డుకోపోతే ఈ అరాచకం ఇలా సాగుతునే ఉంటుంది.. దీన్ని ప్రతిఘటించాలనే ఉద్దేశంతోనే పాల ధర పెంపుకు నిరసనగా ఉద్యమానికి పిలుపు నిస్తున్నాము.. ప్రభుత్వం దిగి వచ్చి తమ నిర్ణయం మార్చుకునే వరకూ ఈ పోరాటం ఆగదు..
బాకా – ప్రతిపక్షం చాలా మొండిగా ప్రవర్తిస్తోంది.. ప్రభుత్వం సాధించాలనుకున్న ప్రగతికి అడ్డుపడుతున్నారు.. అతి వేగం గా పరుగులు తీస్తున్న ఈ ప్రగతి రధానికి కాలు అడ్డు పెడితే మరి ప్రజలు చూస్తూ ఊరుకోరని వారి కాలే పచ్చడవుతుందని హెచ్చరిస్తూ ఉన్నాను..
కసి – ప్రజా వెల్లువ లో ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం.. పోతే, మా ఉద్యమానికి పాల పొంగు అని పేరు నిర్ణయించాము.. పెంచిన పాలధర మాలో ఉద్యమ స్ఫూర్తి కలిగించింది కాబట్టి పాలపొంగనే పేరు ఎంతో సముచితంగా ఉంది..
సోది – మీ నిరసనలకు ప్రభుత్వ దిగి వస్తుందనుకుంటున్నారా..
కసి – తప్పకుండా.. దిగి రావాలి..
సోది – మీ ఉద్యమ కార్యక్రమాలేమిటి..
కసి – రేపటి నుండి నిరసన ప్రదర్శనలు, మండలాలలో తహసిల్దార్ ఆఫీసుల, జిల్లాలో కలెక్టర్ ఆఫీసు ల ముట్టడి. ఈ నెల 30న అసెంబ్లీ ముట్టడి..
సోది – వారి కార్యక్రమాలు విన్నారు కదా.. మీరు ఈ నిరసనలను ఎలా ఎదుర్కోవాలని అనుకుంటున్నారు..
బాకా – ఇటువంటి నిరసనలు, ఉద్యామాలు కొత్తవి కావు.. ప్రజల సహకారం లేని ఉద్యమాలు పుబ్బలో పుట్టి మఘ లో మాడి పోతాయి.. ఇటువంటి కుహనా ఉద్యమాలని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచి వేస్తుంది..
కసి – ఇటువంటి తాటాకు చప్పుళ్లకు బెదరడానికి మేమేమి కుందేళ్లం కాదు..అమీ తుమీ తేల్చుకుంటాం.. ఇటువంటి అప్రజాస్వామిక విధానాలతో ఉద్యమాలు ఆగవు..
సోది – ఒకే.. టైం కావస్తోంది.. పాల ధర పెంపు నిర్ణయం పై ప్రతిపక్షం ఇచ్చిన ఆందోళన పిలుపు సమంజసమని మీరు అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు కు అవునని ముఫ్పై శాతం, కాదని డభ్బై శాతం ఎస్.ఎం.ఎస్. ఇచ్చారు..
బాకా – చూసారుగా వీరి ఉద్యమానికి ప్రజల సపోర్ట్ లేదని తేలింది..
కసి – ఏదో సామెత చెప్పినట్టు సెలక్టివ్ గా వచ్చిన ఎస్.ఎం.ఎస్. లబట్టి చెప్పడం మూర్ఖత్వం..
సోది – కరెక్ట్.. ఈ రోజు కార్యక్రమాన్ని చూసి, పంపిన కొద్ది పాటి ఎస్.ఎం.ఎస్.లు ప్రజల నాడి అనలేం..
బాకా – అన్నం ఉడికిందో లేదో అని చూడడానికి ఒక్క మెతుకు చాలు..
కసి – కానీ సాంపిల్ మొత్తం డేటాని రిప్రజంట్ చేయాలి..అంతే కాని..
సోది – అఫ్ కోర్స్.. ఈ చర్చని ఇంతటితో ముగిస్తున్నాము.. ఈ చర్చకి విచ్చేసిన కాశీనాధ్ గారికి, అలాగే ఫోన్ లైన్లో సహకరించిన కనకరాజు గారికి నమస్కారాలు.. రేపటికి ఇదే సమయానికి కలుసుకుందాం.. శలవు..
సన్నివేశం – 2
(ఒక సామాన్య రైతు తన ఇంటి వసారాలో కూర్చొని తాడు పేనుకుంటున్నాడు..)
రై.భా. – (చేటలో బియ్యంతో వచ్చి వారగా కూర్చొని బియ్యం ఏరుకుంటూ..) ఏమయ్యా.. వడ్లు కుళ్లి పోతున్నాయి.. అమ్ముడయ్యే దారి చూడయ్యా..
రైతు – అనవే అను..వడ్లు అమ్మడం నాకిష్టం లేదు..వాటిని కుళ్ల బెట్టుకుంటే నాకానందం..ఏందే నీ నస.. వడ్లకి ధర పలకడం లేదు.. మిగలకపోతే పోయె.. కనీసం ఖర్చులైనా రావాలి కదా..
రై.భా – నిజమే అనుకో.. కానీ వడ్లు పాడైతే ఈ ధర కూడా రాదు కదయ్యా..
రైతు – ఈ రోజు కాక పోతే రేపైనా మంచి రేటు వస్తుందేమోనని ఆశ.. కానీ, నువ్వు చెప్పినట్లు అత్యాశ అవుతుందేమో..అమ్మబోతే అడవి..కొన బోతే కొరివిలా తయారైంది..
రై.భా. – కాలమిలా అయిందేమిటయ్యా.. ఆ ముందుటేడు పత్తి వేస్తే దిగుబడి లేదు.. కిందటేడు పొగాగు దిగుబడి బాగుందనుకుంటే ధర పలక లేదు.. ఖర్చులు కూడా రాలేదు..ఈ సారి వరైనా ధర పలుకుతుందనుకుంటే ఈ విధంగా అయింది..
రైతు – మూడేళ్ల క్రితం తీసుకున్న అప్పులింకా అలాగే ఉన్నాయి.. వడ్డీ పెరిగి పోతోంది..పైసా జమ చేయ లేదు.. అప్పుల వాళ్లని తప్పించుకొని తిరుగుతున్నాను..
రై.భా. – ఏం చేద్దామనుకుంటున్నావు..
రైతు – ఏం చేయడానికి పాలు పోడం లేదే.వ్యవసాయం ఏడాది కేడాది తీసికట్టుగా ఉంది.. పెట్టుబడికి అప్పు చేయక తప్పడం లేదు.అప్పుఅనుకున్న టైంలో తీర్చకపోతే మాట పడ వలసి వస్తోంది.ఇంత కాలం దిగుబడి రాక బెంగ.. ఇప్పుడు దిగుబడికి ధర రాక బెంగ..
రై.భా. – వ్యవసాయం, దానికి పెట్టుబడి మాటే చెబుతున్నావు కానీ, ఇల్లు గడిచే దారి ఆలోచించడం లేదు..
రైతు – మాట వరసకి పెట్టుబడికి అప్పు అంటున్నాను కానీ, ఇంటి ఖర్చులకు కూడా అప్పు అవుతున్నాది కదా.. ఇద్దరమ్మాయిల పెళ్లిలకి చేసిన అప్పులకైతేనేం, తరవాత వ్యవసాయం ఖర్చులకి చేసిన అప్పులకైతేనేం ఐదెకరాల పొలం హరించుకు పోయింది.. చేతికంది వచ్చిన కొడుకు నిర్పూచిగా తిరుగుతున్నాడు.. అవునూ.. దొరవారింట్లో లేరా.. కనబడడం లేదు..
రై.భా. – ఎవరయ్యా..
రైతు – ఇంకెవరు..నీ ముద్దుల కొడుకు.. మన కులదీపకుడు..
రై.భా. – వయస్సులో ఉన్న కుర్రాడు.. ఇంట్లో ఎంత సేపని కూర్చొంటాడు.. అలా స్నేహితులతో కబుర్లు చెప్పుకోడానికి వెళ్లి ఉంటాడు.. (వీధి వైపు చూసి) అదిగో మాటల్లోనే వచ్చాడు..
(రైతు కొడుకు బయటనుండి వచ్చాడు..)
రైతు – ఏరా.. షికార్లు పూర్తయ్యాయా..(రైతు కొడుకు మాట్లడకుండా లోనికి వెళ్లేడు..) చూసావా.. వాడి పొగరు.. చెట్టంత మనిషిని అడుగుతూ ఉంటే ప్రశ్నకి బదులు చెప్పకుండా వెళ్లేడు..
రై.భా. – ఊరుకోవయ్యా.. వాడికి నువ్వటే భయం.. నీతో మాట్లాడడానికే వెనకాడతాడు..
రైతు – అబ్బో.. భయ భక్తులు కారిపోతున్నాయి..
రై.కొ. – (లోనుంచి వస్తూ) ఇలా అయిన దానికీ, కాని దానికీ ఇలా మీద పడి పోతూ ఉంటే ఏం మాట్లాడతాను..
రైతు – అలా రికామిగా తిరిగే బదులు నాకు తోడుగా పొలం పనులు చూడవచ్చు కదా..
రై,కొ. – నేను చదువుకున్నాను.. మట్టి పిసుక్కుంటూ బ్రతకడం నాకిష్టం లేదు..
రైతు – మరేం చేస్తావు..
రై.కొ. – ఉద్యోగం..
రైతు – అబ్బో.. బాగానే ఉంది..కానీ ఎవరిస్తారట ఉద్యోగం..
రై.భా. – అవనయ్యా.. చదువు కుంటున్నాడు కదా.. వ్యవసాయం చేయడానికి..
రైతు – నామోషినా..వాడు రైతు బిడ్డే..పొలం దున్నడానికి నామోషి అఖ్కర లేదు..
రై.భా. – అలా విరుచుకు పడకయ్యా.. ఏదైనా ఉద్యోగం చూస్తే..
రైతు – దొర వారు చేసి పెడతరా.. అవును మరి.. ఉద్యోగాలు చెట్లకి కాస్తున్నాయి.. కోసి తెచ్చుకోవడమే తరవాయి..
రై.భా. – అది కాదయ్యా..
రైతు – ఏది కాదే.. ఈయన గారు ఏం పెద్ద చదువు వెలగ బెట్టేడని ఉద్యోగం వస్తుంది.. ఇంటర్మీయట్ దాటడం లేదు.. ఓ పాతిక సంవత్సరాల క్రితం ఐతే, ఎవడి కాళ్లో పట్టుకుంటే ఏ బంట్రోతు ఉద్యోగమో దొరికేది.. ఇవాళ రేపు ఉన్న ఉద్యోగాలే ఎప్పుడు ఊడిపోతాయో తెలియని స్ధితి.. కొత్త ఉద్యోగాలెక్కడ నుండి పుట్టుకొస్తాయి…
రై.భా. – నువ్వే అలా అంటే ఎలాగయ్యా..
రైతు – ఉన్న మాటే చెబుతున్నానే..
రై.భా. – పోనీ మరో దారి ఏదో ఒకటి ఆలోచించు..
రైతు – మరో దారేముంది..
రై.భా. – వ్యాపారం చేస్తాను..
రైతు – పెట్టుబడి..
రై.కొ.- పొలం అమ్మేదాం..
రైతు – అబ్బో.. చాలా పెద్ద ఆలోచనే చేసావు.. చూసావుటో నీ కొడుకు పొలం అమ్మి వ్యాపారం చేస్తాడట..విన్నావా..
రై.భా. – వాడన్నాడని కాదు.. నువ్వు చెప్పు.. నువ్వు పడుతున్న కష్టాలు చాలవనా.. వాడిని కూడా భూమిని నమ్ముకుని బతకమంటున్నావు..
రైతు – ఒసే.. ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడు తన పిల్లలని రాజకీయాలలోకి తీసుకు వస్తాడు.. సినిమా వాళ్లు తమ కొడుకుల్ని సినిమాల్లోకి చేరుస్తారు.. ఉద్యోగస్తులు తమ సంతానం తమను మించిన ఉద్యోగం లో ఉండాలనుకుంటారు.. కానీ ఏ రైతు తన కొడుకు రైతు కావాలనుకోడు.. ఎందుకో తెలుసా.. వ్యవసాయం రైతుని అప్పుల ఊబిలో తోస్తుంది.. అందులోచి బయట పడలేక, అప్పుల వాళ్లతో మాట పడ లేక, ఆత్మాభిమానం ఉన్న రైతు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుంటాడే.. కౌలు రైతు, చిన్న రైతు, సన్నకారు రైతులే కాదు కామందులు కూడా తన కొడుకులను వ్యవసాయం మీద బ్రతకాలనుకోరు.. పంటపొలాలు తగ్గు తున్నాయి.. ఇదే పరిస్ధితి కొనసాగితే ఇక ముందు పంట పడించే వాడు లేక తిండి గింజలు కరువయ్యే పరిస్ధితి వస్తుంది.. బంగారాన్ని, డబ్బు ఎవరు తినలేరు..
రై.కొ. – ఎవరూ ముందుకు రావడం లేదని నేను మట్టి పిసుక్కుంటూ బ్రతకాలా..
రైతు – నేనేం అంత ఆదర్శవాదిని కాదురా.. అందరి తండ్రుల లాగానే నా కొడుకు మడత నలగని బట్టలు వేసుకొని కష్టమన్నది తెలియకుండా బ్రతకాలన్నదే నాకోరిక.. కానీ నీకు చదువు వంట బట్టలేదు.. నువ్వ చదివిన చదువు బ్రతుకు తెరువు ఏర్పర్చ లేదు కానీ, వ్యవసాయం చేయడానికి అడ్డు వస్తోంది.. నీ చదువుకు ఒక ఎకరం పొలానికి ఱెక్కలు వచ్చాయి కానీ నీకు నాలుగక్షరాలు వంట బట్ట లేదు.. ఈ భూమిని డబ్బుగా మార్చి వ్యాపారం పెడితే నెగ్గుకు వస్తావని నమ్మకం లేదు.. కారణం, చదువుకోమని నిన్ను పట్నం పంపితే పోకిరి స్నేహాలబ్బాయి.. సోమరి తనం అలవాటయింది..
రై.కొ. – ఐతే నాకు వ్యాపారం చేసుకోడానికి డబ్బు ఇయ్యనంటావు..
రైతు – అవును..
రై.భా. – ఏమిటయ్యా..
రై.కొ. – కొడుకంటే మమకారం ఉంటే కదా..
రైతు – మమకారం ఉంది కాబట్టే వ్యాపారం వద్దంటున్నాను.. ఉన్న కాస్త భూమి అమ్మితే వచ్చే డబ్బు వ్యాపారంలో పెడితే ఏడాది తిరిగే సరికి కరారావుడై పోతుంది.. అదే వ్యవసాయం ఐతే, మరికొంత కాలం వస్తుందని, మరో విధంగా చెప్పాలంటే మరికొంత కాలమైనా బ్రతికి బట్ట కడతావని.. మరో మాట లేదు.. రేపటి నుండి నాతో పొలానికి రా… (విసురుగా బయటకు వెళ్లిపోతాడు..)
రై.కొ. – చూసేవా అమ్మా..ఆయన పంతం..
రై.భా. – ఆయన చెప్పిన మాటలలో కూడా హేతువు ఉందనిపిస్తోందిరా..
రై.కొ. – అవునులే.. నీదీ ఆయన మాటే..
రై.భా. మీ ఇద్దరితో నాకు చావు వచ్చి పడిందిరా.. ఎవరి మాట వారిదే.. ఇద్దరికీ సర్ది చెప్పలేక పోతున్నాను.. (తెరలోంచి వదినా అని పిలుపు..) ఎవరు.. సూరమ్మొదినా.. వస్తున్నా.. (వెళ్తుంది)
రై,కొ. – ఎలా తప్పించుకోవాలి.. ఈ గండం నుంచి ఎలా బయిట పడాలి.. ఏదో మార్గం చూసుకోవాలి.. అమ్మ కూడా ఇంతకంటే నాన్నకి చెప్పలేదు.. ఇప్పుడేమి దారి..
(కొడుకు స్నేహితుడు బయటనుంచి వస్తాడు..)
కొ.స్నే. – ఏమిట్రా.. అంత డల్ గా ఉన్నావు..
రై.కొ. – రారా సమయానికి వచ్చేవు.. నువ్వే ఏదో ఒక దారి చూపించాలి..
కొ.స్నే. – ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిట్రా..
రై.కొ. – మా నాన్న నేను పని పాటా లేకుండా తిరుగుతున్నానని తిడుతున్నారా..
కొ.స్నే. – అందులో వింతేముంది.. నన్నడిగితే తండ్రులు ఉన్నది తిట్టడానికే అనిపిస్తుంది..
రై.కొ. – అది కాదురా.. ఉద్యోగం దొరకలేదంటే అది మన తప్పా.. ఐనా మనం ఎంత సిన్సియర్ గా ట్రై చేస్తున్నాం ఉద్యోగం గురించి.. ఇవన్నీ వాళ్లు పట్టించుకోరేంట్రా..
కొ.స్నే. – మరదే కదా మన ఖర్మ..
రై.కొ. – అంతే కాదురా.. రేపటి నుండి పొలం పనుల్లో తనకి సాయం రమ్మనమని ఆర్డర్ పాస్ చేసాడ్రా..
కొ.స్నే. – వాట్..
రై.కొ. – అవునురా..
కొ.స్నే. – అయిపోయేవురా.. నువ్వు ఫినిష్..
రై.కొ. – ఇప్పుడెలారా..
కొ.స్నే. – పెద్ద వాళ్లు ఏవేవే అంటారు.. వాళ్ల మాటలన్నీ పాటిస్తామా.. అంత వినే వాళ్లమే ఐతే మన బ్రతుకులు ఎందుకిలా ఉంటాయి.. వాళ్ల మాటలు దారి వాళ్లదే.. మన దారి మనదే..
రై.కొ. – నీకు తెలియదురా.. మా నాన్న చండ శాసనుడు.. అందుకే ఏం చేయాలో తెలియక వర్రీ అవుతున్నాను..
కొ.స్నే. – ఒరే.. ఆలోచించాను.. చించేసాను.. చించగా, చించగా నాకోటి తట్టింది ప్లాన్..
రై.కొ. – ఏమిట్రా అది..
కొ.స్నే. – కొంత కాలం ఇక్కడ నుండి బిచాణా ఎత్తేయి..
రై.కొ. – అంటే.. అర్ధమయ్యేటట్టు చెప్పరా..
కొ.స్నే. – సింపిల్.. ఒక వారం రోజుల పాటు కనబడకుండా ఎటైనా పారిపో..
రై.కొ. – కానీ..
కొ.స్నే. – నేను చెప్పింది వినరా.. దానితో అమ్మా, నాన్నా బెంగ పెట్టుకుంటారు.. నువ్వు కనిపించలేదని గాభరా పడతారు.. నువ్వు వచ్చేటప్పటికి ఇవన్నీ మరచి పోయి ఆనందిస్తారు..
రై.కొ. – అంతేనంటావా..
కొ.స్నే. – అంతే.. అంతే కాదు.. ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎక్కడికైనా వెళ్లిపోతానని భయం పెట్టుకుంటుంది..
రై.కొ. – అవున్రోయ్…
కొ.స్నే. – మనమంటే తల్లిదండ్రులకు భయం ఉండాలంటే ఇదే మార్గం.. అదీ కాక మనం చెప్పినట్లు వాళ్లు వినాలి కాని వాళ్లు చెప్పినట్లు మనం వినకూడదు.. వాళ్లు చెప్పినట్లు మనం ఉండడం అన్న ఊహే పెద్ద హెల్..సో.. మీ నాన్న తిట్లూ, చివాట్లు లేకుండా హాయిగా ఉండాలంటే.. చలో..ఒరే.. వేర్ ది మైండ్ ఈజ్ వితవుట్ ఫియర్ అని చదువుకున్నాం కదా..
రై.కొ. – కానీ ఎక్కడికి వెళ్లాలి..
కొ.స్నే. – ఎక్కడికైనా.. వెళ్లదలచుకుంటే ఎక్కడికైనా వెళ్లవచ్చు.. ఈ ప్రపంచం చాలా విశాలమైనది,,
రై.కొ. – మరి డబ్బు..
కొ.స్నే. – బారో ఆర్ స్టీల్..
రై.కొ. – నీతో వచ్చిన చికాకిదే.. సగం అర్ధమై సగం అర్దం కాకుండా మాట్లాడతావు..
కొ.స్నే. – అదేరా.. మీ నాన్న దాచిన డబ్బులోంచి కొట్టేయ్.. లేదా మీ నాన్నా పేరు ఉపయోగించి అప్పు పుట్టించుకో..
రై,కొ. – నాకెందుకో భయంగా ఉందిరా..
కొ.స్నే. – నీ ఖర్మ.. నిన్ను బాగు చేయడం నావల్ల కాదురా..
రై.కొ. – అలా విసుక్కోకురా..
కొ.స్నే. – మరేం చేయమంటావు చెప్పు.. మంచి సలహా చెబితే ఎగిరి గెంతేయాల్సింది పోయి అలా నీళ్లు నముల్తావేం..
రై.కొ. – అది కాదురా.. ఇదంతా కొత్తగా..
కొ.స్నే. – ఉందా.. మొదట్లో ఏదైనా అలాగే ఉంటుంది.. పుడుతునే అన్నీ నేర్చుకుని పుట్టం కదా.. సపోజ్.. చేతిలో సిగరెట్ తో పుట్టేమా.. లేదే.. చేతిలో మందు గ్లాసుతో పుట్టేమా.. అవన్నీ నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకోలేదూ.. మొదట్లో సిగరెట్ పొగకి ఉక్కిరి బిక్కరి కాలేదూ.. మందు కొట్టే ముందు రోజుల్లో కక్కుకోలేదూ.. ఇప్పుడు నువ్వు ఫుల్ బాటిల్ దించకుండా కొట్టేసే స్ధాయికి ఎదిగేవా లేదా.. ప్రాక్టీస్ రా ప్రాక్టీస్.. ఏ మంచి పనైనా ఏదో ఒక రోజు మొదలు పెట్టాలి.. నెమ్మదిగా అలవాటవుతుంది.. దట్సాల్..
రై.కొ. – నువ్వెన్ని చెప్పినా..
కొ.స్నే. – నీ ఇష్టంరా.. దారి చూపేను.. డబ్బు పుట్టే విధానం చెప్పేను.. ఆల్ రైట్.. (కొద్దిగా ఆలోచించి) సరే.. నాకో సంగతి జ్ఞాపకం వచ్చింది.. అది వర్కవుట్ అవుతుందేమో చూడు..
రై.కొ. – ఏమిట్రా అది..
కొ.స్నే. – జాగ్రత్తగా విను.. హైదరాబాద్ కి ఈ ఊరినుంచి లారీలో జనాల్ని తీసుకు వెళ్తున్నారు..
రై.కొ. – ఎందుకు..
కొ.స్నే. – ఎందుకో ఒకందుకు.. అది మనకంత అవసరమా..
రై.కో. – (నసుగుతూ) కాదనుకో…
కొ.స్నే. – కాదు కదా.. ఏ పార్టీ మీటింగ్ కో జనాల్ని తోలుకు వెళ్తున్నారు.. లారీ ఎక్కేయ్..
రై.కొ. – కానీ అక్కడ భోజనం.. పడుకోడం..
కొ.స్నే. – అబ్బా.. అనుమానం ముందు పుట్టి తరవాత నువ్వు పుట్టేవురా.. నిన్ను లారీ ఎక్కించి, తరవాత అన్నం పొట్లాలో, పులిహోర పొట్లాలో నీ మొహాన పడేస్తారు.. మెక్కేయ్.. అక్కడ అందరితో బాటు పబ్లిక్ గార్డెన్స్ లోనో ,టేంక్ బండ్ మీదోపడకేసేయి.. నినిక్కడ నుండి తీసుకువెళ్లే మేస్త్రీని వదలకు..అక్కడ కూడా భోజనం పొట్లాలు ఇస్తారు..తిరిగి లారీలో ఇక్కడ పడేస్తారు.. సరేనా..
రై.కొ. – ఇవన్నీ నీకెలా తెలుసురా..
కొ.స్నే. – అనుభవం.. ఎక్స్పీరియన్స్.. ఎన్ని సార్లు ఇంట్లో తిట్లు తిన లేదు.. ఇలా ఎన్ని సార్లు ఉడాయించ లేదు..
రై.కొ. – నువ్వు కూడా రారాదురా..
కొ.స్నే. – రావచ్చునుకో..
రై.కొ. – మరి.. నాకూ తోడుగా ఉంటుంది.. ధైర్యంగా ఉంటుంది..
కొ.స్నే. – చూద్దాం.. ఒరేయి.. నాకోసం చూస్తూ నువ్వు ఉండి పోకు.. ఎందుకంటే మా తాతకి వంట్లో బాగా లేదు… మా నాన్న ఇల్లు కదలడం లేదు.. నన్ను కదలనీయడం లేదు.. నాన్న కళ్లు కప్పి నీ దగ్గరకి రాడానికే తల ప్రాణం తోక్కి వచ్చింది.. ఇదిగో నీతో మాట్లాడి తల నెప్పి కూడా వచ్చింది.. పద.. కాసులు గాడి బడ్డీ దగ్గరకి వెళ్లి టీ దాగి వద్దాం..
రై.కొ. – పద.. (ఇద్దరూ వెళతారు)
సన్నివేశం 3
(రెండు స్పాట్లు.. ఒక స్పాట్లో బాకా, మరో స్పాట్లో కసి సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు)
బాకా – హల్లో పోలీస్ కమీషనర్ గారూ.. నమస్కారం.. నేను కాశీని..
కసి – హల్లో మల్లేష్.. నేను కనకరాజుని..
బాకా – రేపపోజిషన్ వాళ్లు బాగా గొడవ చేసేటట్లు ఉన్నారు.. అవును..వియ్ హేవ్ టు చెక్ దెం..
కసి – పోతే.. రేపటికి అంతా సిధ్దం గా ఉన్నరు కదా..వెరీ గుడ్..రేపు చాలా బాగా హై లెవల్లో అల్లరి జరగాలి..
బాకా – రేపు అల్లర్లలో అపోజిషన్ బాగా అన్ పాప్ లర్ కావాలి.. మరి, ప్రజల్లో వాళ్లకున్న ఇమేజి బాగా తగ్గాలి..
కసి – పోతే, మీరు పోలీసుల్ని మాగ్జిమం ప్రవోక్ చేయాలి.. పోలీసులు తొందర పడేటట్లు చేయాలి.. వాళ్లు మనల్ని ఎటాక్ చేయాలి.. మనం ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలి..
బాకా – పెద్దాయన మరి అపోజిషన్ వాళ్ల యాటిట్యూడ్ కి మండి పడుతున్నారు.. అవును.. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు మరి ధరలు పెరగ లేదా.. ఆందోళనలు జరగలేదా.. వాళ్లు ఇటువంటి చర్యలు తీసుకోలేదా..
కసి – గుడ్.. పోతే, మాట వినేవాళ్లని, ప్రాణం అంటే మమకారం లేని వాళ్లని చూడు.. వీలైతే అమాయకంగా ఉన్న వాళ్లని… కాదు.. అలా కనిపించే వాళ్లని ఏరి ముందు వరసలో నించో పెట్టు.. జరగరానిది జరిగితే సింపతీ కలగాలి.. దాన్ని మనం ఎన్ కేష్ చేసుకోవాలి..
బాకా – ఎలాగైనా అపోజిషన్ కి మరి అప్పర్ హేండ్ రాకుండా చూడమని పెద్దాయన ఆర్డర్ వేశారు.. ఒక వేళ గొడల అదుపులో ఉండి మరి అపోజిషన్ కి ఫేవరబుల్ గా ఉండే పక్షంలో పోలీసుల్ని కొంతమందిని మఫ్టీలో వాళ్లలోకి పంపి రాళ్లు వేయించండి. .పోలీసులు దానితో మరి డైరక్ట్ ఏక్షన్ లోకి దిగాలి.. దట్స్ గుడ్.. ఎస్..మీకు ఇవన్నీ చెప్పాలా.. కానీ, పెద్దాయన చాలా పర్టికులర్ గా ఉన్నారు.. అందుకే ఇంతలా చెబుతున్నాను.. మరోలా అనుకోవద్దు.. గుడ్.. ఎవరడ్డొచ్చినా కేర్ చేయకండి.. కరకుగా ఉండండి.. ప్రాణాలు మరి పోయినా ఫర్వాలేదు.. అన్నీ ఆయన చూసుకుంటారు.. పెద్దాయన మరీమరీ చెప్పారు.. జాగ్రత్తగా చూసుకోండి..అఫ్ కోర్స్.. గుడ్.. అన్నట్లు మీ ప్రమోషన్ విషయం కూడా మరి పెద్దాయనతో మాట్లాడాను.. ఇది కాగానే చూద్దామన్నారు.. ఉంటాను..
కసి – కమీషనర్ని ఓ కంట కనిపెడుతూ ఉండండి.. వాడు పూర్తిగా గవర్నమెంట్ మనిషి.. మళ్లీ మనం అధికారం లోకి రాగానే వాడినో పట్టు పట్టాలి.. సరే.. అంతా జాగ్రత్తగా నడిపించండి.. యాంటీ సోషల్ ఎలిమెంట్స్, పచ్చి నెత్తురు తాగే గుండాలు జమ కావాలి.. రైట్ .. ఉంటాను..
సన్నివేశం 4
(నాలుగు రోడ్ల కూడలి.. మధ్యలో కసి)
కసి ప్రజలారా..మా పిలుపునందుకొని పాలపొంగు ఉద్యమంలో భాగంగా నిరసన ప్రదర్శనలలో పాల్గొని మా గత కార్యక్రమాలు జయప్రదం చేసేరు.. ఈ విజయాన్ని ప్రజావిజయంగా భావించి ప్రభుత్వం కళ్లు తెరవక పోవడం దురదృష్టకరం..పోతే ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి లక్షలాది జనం ఇలా తరలి రావడం మా పట్ల, మా పోరాటం పట్ల ప్రజలకి ఉన్న అభిమానానికీ, నమ్మకానికీ నమ్మకం..మీరు చూపుతున్న ఆదరణకు నాకు నోటమాట రావడం లేదు..(కళ్లు తుడుచుకొని) పోతే, ఈ పోరాటం శాంతి యుతంగా సాగాలి.. పోలీసులు మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవచ్చు..వాళ్ల కవ్వింపు చర్యలకు మీరు స్పందించి హింసకు పాల్పడ వద్దని నా ప్రార్దన.. పోతే, ఒక చెంప కొడితే మరో చెంప చూపాలన్న గాంధీ సిధ్దాంతాన్ని నమ్ముకున్నాం.. మన ప్రస్ధానం అసెంబ్లీకీ శాంతియుతంగా సాగాలి..
( పాలపొంగు వర్ధిల్లాలి.. ఇంక్విలాబ్ జిందాబాద్.. ప్రభుత్వం దిగి రావాలి.. పాలధర తగ్గించాలి.. అన్న నినాదాలు.. స్టేజి ఒక వైపు నుండి మరొక వైపుకు ప్రజలు తోసుకు వస్తున్నారు.. ఎదురుగా పోలీసులు వస్తూ ఉంటారు..స్టేజీ మధ్యగా పోలీసులు ఆందోళన కారులను అడ్డుకుంటారు..ఆందోళన కారులు ముందుకు చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లని పోలీసులు వెనక్కి నెట్టేస్తూ ఉంటారు.. తొక్కిసలాట బాగా జరుగుతోంది.. పోలీసులు ఆందోళన కారులను నెట్టడంలో విఫలమై వారిని చెదర గొట్టడానికి భాష్ప వాయువు, నీరును ధారగా వదలడం వంటి ప్రయోగాలు చేసారు..అవి విఫలం కావడంతో కేనింగ్ మొదలు పెట్టారు.. దానితో ఆందోళన కారులు వెనక్కి తగ్గి వెను తిరిగారు.. పోలీసులు ఆందోళన కారులను తరిము కుంటూ వెళ్లారు.. అలా కొంత దూరం వెళ్లిన తరువాత వెనుతిరిగిన ఆందోళన కారుల నుండి రాళ్లు పోలీసులపై పడ్డాయి.. ఆందోళన కారులు రాళ్లు విసురుతూ పోలీసుల్ని తరమ సాగారు.. ఇలా పోలీసులు వెనుకడగు వేయడంతో ఆందోళన కారులు మరింత విజృభించారు..దానితో పోలీసులు కాల్పులు ప్రారంభించారు..ఈ గలాటలాలో తచ్చాడుతూ గాబరా పడిన రైతు కొడుకు ఈ ఊరేగింపుకు ముందుకు రావడం, పోలీసు తూటా అతడికి తగిలి మరణించడం జరిగింది.. ఎప్పుడైతే మరణం సంభవించిందో ఆందోళన కారులు తగ్గారు..క్రమక్రమంగా అల్లరి సద్దు మణిగింది..పడి ఉన్న శవం వద్దకు కసి వచ్చాడు.)
కసి – అయ్యయో ఏమిటీ విపరీతం.. ముక్కు పచ్చలారని పిల్లవాడిని బలి తీసుకున్నారా.. ఏమి దురన్యాయం.. పోతే, ఎటువంటి ముందు హెచ్చరికా లేకుండా పోలీసులు కాల్పులు జరుపుతారా.. నాటి జలియన్ వాలా బాగ్ ను తలపిస్తోంది నేటి పోలీసులు దురాగతం.. నాటి నాజీలను మించిన నిరంకుశత్వంతో నడుస్తోంది నేటి ప్రభుత్వం.. సభ్య ప్రపంచం యావత్తూ తలదించుకోవలసిన సంఘటన ఇది.. పోలీసులు ఉద్దేశ పూర్వకంగా చేసారీ హత్య..దీన్ని మా ప్రతి పక్షం, పార్టీలకతీతంగా ముక్త కంఠంతో ఖండిస్తోంది.. పోతే, ఈ దుర్ఘటనకి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. ఈ యువకుడు ఆత్మార్పణ చేసిన ఈ పవిత్ర స్థలంలో ఇతడి శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.. ప్రజాస్వామ్య చరిత్రలో రక్తసిక్తమైన ఈ రోజును బ్లాక్ డే గా అభివర్ణిస్తూ, ఈ రోజును ప్రతి సంవత్సరం బ్లాక్ డే గా అబ్జర్వు చేస్తాం.. (పోలీసులు వచ్చి కసిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు..) ఇదిగో ప్రభుత్వం మా నోరు నొక్కడానికి చేస్తున్న ప్రయత్నం..అర చేతులతో సూర్యోదాయాన్ని ఆపలేరు.. నిర్భీతిగా సాగుతున్న ప్రజాకంటకాన్ని, పాలకపక్ష గూండాలుగా వ్యవ్హరిస్తున్న ఈ పోలీసులు జులుంని, ఈ నిరంకుశ ధోరణిని నా ప్రజలకు తెలియ చేస్తాను.. నా శరీరంలో తుది రక్తపు బొట్టు వరకూ పోరాటాన్ని కొనసాగిస్తాను. (పోలీస్ అధికారి కసిని బుజ్జగించి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాడు.. కానీ ప్రతిపక్ష నాయకుడు సహకరించడు..పోలీస్ అధికారి నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తాడు.. కానీ ఫలితం లేక పోవడంతో పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లే ప్రయత్నం చే్స్తారు..ఆ ప్రయత్నంలో బట్టలు చిరుగుతాయి.. గాయాలవుతాయి..). చూసేరా.. పోలీసుల దౌర్జన్యం..ఒక ప్రతిపక్ష నాయకుడితో వ్యవ్హరించవలసిన తీరు ఇదేనా.. ఇది ప్రజాస్వామ్య విరుధ్ధమని నేను మనవి చేసుకుంటున్నాను.. మీ కోసమే నేను.. పోలీసుల దమన కాండకు నిరసనగా నేను సోమవారం బంద్ కు పిలుపునిస్తున్నాను..(కసిని పోలీసులు బలవంతంగా లాక్కుని పోయారు..)
బాకా – (స్పాట్ లైట్ లో నుంచొని) ప్రభుత్వం తప్పని సరి పరిస్దితులలో తీసుకొన్న నిర్ణయాన్ని తప్పు పట్టి ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాలు ప్రతిపక్షం వారు చేసారు.. అంతటితో ఆగేరా..లేదే.. సంఘ వ్యతిరేక శక్తులతో మరి చేతులు కలిపి అల్లర్లు చేసారు.. అరాచకం సృష్టించారు..వారికీ, ఉద్యమానికి, అసాంఘీక వ్యక్తులకి మరి సంబంధం ఉందని చెప్పడానికి పోలీస్ కాల్పులలో మరణించిన వ్యక్తే సాక్షం.. అతడో యాంటీ సోషల్ ఎలిమెంట్.. పోలీస్ రికార్డ్ లలో అతనో నటోరియస్ క్రిమినల్.. అలా అని మరి అతని మరణాన్ని మేం సమర్ధించుకోడం లేదు.. అదో దురదృష్టకర సంఘటన.. జరిగిన దానికి మేం ఎంతో విచారిస్తున్నాం..కానీ, దురదృష్టమేమంటే ఒక క్రిమినల్ అనుకోని పరిస్ధితులలో మరణిస్తే మరి దాన్నో పెద్ద ఇష్యూ చేసి తమ పబ్బం గడుపుకుందామనుకుంటున్నారు మన ప్రతి పక్షం వాళ్లు…. మరి, ఇది వారి దివాళాకోరు, దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోందన్న విషయాన్ని రాష్ట్రంలో యావన్మంది జనానీకానికీ తెలియ చేస్తున్నాను.. మీరంతా ప్రతి పక్ష ఇచ్చిన బంద్ పిలువును తిప్పి కొట్టి ప్రభుత్వానికి మీ మద్దత్తు తెలియ చేసి ప్రతి పక్షం వారికి గుణపాఠం చెబుతారని ఆశిస్తున్నాను..
సన్నివేశం 5
(రెండో సన్నివేశం రంగాలంకరణ.. రైతు భార్య ఇంటి వసారాలో దిగులుగా అన్యమనస్కంగా కూర్చొంటుంది)
రైతు – (బయట నుంచి వచ్చి) ఏమే.. మంచినీళ్లు తీసుకురా.. (అరుగు మీద కూర్చొన్నాడు.. పరధ్యానంలో ఉన్న భార్య గమనించదు..) నిన్నేనే..(గట్టిగా పిలిచాడు)
రై.భా. – (కేకకి ఆలోచన లోంచి తేరుకొని) ఏవయ్యా..
రైతు – మంచినీళ్లే..
రై.భా – (లోనికి వెళ్లి మంచినీళ్ల గ్లాసుతో వచ్చి) ఇదిగోనయ్యా..
రైతు – (మంచినీళ్ల గ్లాసు అందుకుంటూ) ఏమిటే ఈ లోకంలో లేవు.. అంత ఆలోచన ఏమిటి..
రై.భా – నీకేమయ్యా.. మగమహారాజువి.. నాది తల్లిపేగయ్యా.. మూడు రోజులుగా కొడుకు కనబడడంలేదనే బాధ కూడా లేదయ్యా నీకు.. పాపం ఎక్కడున్నాడో ఏమో.. కనీసం వెతకాలనే ఆలోచన కూడా లేదయ్యా నీకు..
రైతు – ఈ విశాల ప్రపంచంలో ఎక్కడని వెతకమంటావే.. రెండు రోజులు కడుపు మాడితే వాడే వస్తాడ్లే..
రై.భా పిచ్చి తండ్రి.. వేళ కింత తింటున్నడో లేదో.. ఏవయ్యా..నీ నిబ్బరానికి మెచ్చుకోవాలయ్యా.. అసలు నువ్వు తండ్రివా.. కసాయివా..
రైతు – అవునే.. తొమ్మిది నెలలు మోసి నువ్వే కన్నావు.. వాడు నీకే కొడుకు.. నాకేమి కాడు..ఏవే.. వాడు నాకూ కొడుకేనే..వాడు జీవితంలో బాగు పడి నాలుగు కాలాలు చల్లగా ఉండాలని తప్ప వాడి మీద నాకు పగా, ఏమిటి.. చెప్పు..వాడు ఏదోవిధం గా బ్రతకాలి కదా.. చదువుకున్నంత మాత్రాన వ్యవసాయం చేయనంటే ఎలా.. నేనూ అంతో ఇంతో చదువుకున్న వాణ్నే కదా..
రై.భా. – ఆ రోజులు వేరు.. అప్పుడు రైతే రాజు..
రైతు – కాదు లేవే.. అప్పటికే వ్యవసాయం మీద మోజు తగ్గి ఉద్యోగాలు వెతుక్కునే రోజులు.. కానీ, నా చదువుకి ఉద్యోగం రాదని తెలిసి ఇదిగో ఇలా వ్యవసాయంలో దిగాను.. చెప్పకేం.. అప్పట్లో నేనూ నీలిగాను..ఐతే నాన్నకి ఎదురు చెప్పే ధైర్యం లేదు కదా..
రై.భా. ఆయన పోయే దాకా, మావయ్య మాటకి నువ్వు ఎదురు చెప్పింది ఎప్పుడు.. ఆయన ఎదుటబడి మాట్లాడే ధైర్యముండేదా నీకు.. నాయన గారి మీసము చూస్తేనే సన్యాసము అన్నట్టు ఉండేది నీ యవ్వారం..
రైతు – మరి వీడు.. వీడికి నా మాటంటేనే గౌరవం లేదు..
రై.భా – అదేం మాటయ్యా..ఈ విషయం లో తప్ప ఏ మరే విషయం లోనైనా ఎదురు చెప్పాడా..
రైతు – అలా వెనకేసుకు రాకు.. చదువు చట్టబండలు చేసాడు.. ఐనా నేను చెప్పేది వాడి బాగుగే కదా..
రై.భా – ఐతే మాత్రం.కొడుక్కి భయం చెప్పే విధానం ఇదేనా.. వాడిని భయ పెట్టి బెదరగొట్టి ఇంటిలోంచి పారిపోయే టట్టు చేసావు..
రైతు – మధ్య నేనేం చేసేనే.. పని నేర్చుకొని జీవితంలో స్ధిరపడరా అన్నాను..అదీ తప్పేనా..
రై.భా – చెప్పేది మంచే.. కాని చెప్పే పధ్దతి లో మంచి మాటలతో చెప్పాలి..
కొ.స్నే. – (గాభరాగా వస్తూ) బాబాయ్..బాబాయ్..
రైతు – ఏరా.. మా వాడి సంగతి ఏమైనా తెలిసిందా..
కొ.స్నే – మరి.. మరి..
రై.భా. ఆ చెప్పేది వేగం చెప్పు బాబూ..
రైతు నీళ్లు నముల్తావేమిరా..
కొ.స్నే – మరి..మరి.. మీరు బలవంతంగా వ్యవసాయంలో పెడుతున్నారని..
రైతు – ఆ.. పెడుతున్నామని..
రై.భా. మధ్యలో నువ్వు మాట్లడకయ్యా.. నువ్వు చెప్పు బాబూ..
కొ.స్నే – మీకు కనిపించకుండా ఉండడానికి ఆ సోమరాజు వాళ్లు ఏర్పాటు చేసిన లారీలో హైదరాబాద్ వెళ్లాడు..
రైతు – ఈ సలహా చెప్పింది నువ్వే ఐ ఉంటావు.. వాడు రానీ.. మీ ఇద్దరికీ నేను చెమ్డాలూ డతీస్తాను..
కొ.స్నే. – అది కాదు బాబాయ్.. మరి..
రైతు – ఇంకా ఏమైందిరా..
రై.భా. – కొంప తీసి ఆ లారీ వాళ్లతో కలిసి ఆ గొడవలు జరిగే దగ్గరకు వెళ్లాడామో..
రైతు – అవునే.. అదీ నిజమే..
కొ.స్నే.- అవును పిన్నీ.. జరిగిన గొడవలన్నీ టివి లో చూపెడుతున్నారు..
రై.భా. – వాటిలో వాణ్ని చూపించారా..
రైతు – గుంపలో గోవిందా అని వీడెక్కడ కనబడతాడే..
కొ.స్నే.- కాదు బాబాయ్..మరి అక్కడ పోలీస్ కాల్పులయ్యాయి కదా.. అందులో ఒకడు చచ్చిపోయాడు.. ఆ శవాన్ని చూపెడుతున్నారు.. ఆ ముఖం మరి.. మరి.. దరిదాపు మనవాడి…
రై.భా. (మాట పూర్తి కాక ముందే) బాబూ..(కేక వేసి పడి పోయింది.. రైతు ఆమె ముఖం మీద నీళ్లు చిలకరించాడు.. లేస్తూనే ఏడుస్తూ) ఏవయ్యా.. మనం తొందరగా వెళ్లి చూద్దామయ్యా..
రైతు అలాగేనే.. అలాగే.. చూడు.. వీడెవరిని చూసి ఎవరనుకున్నాడో..ఐనా మన వాడికి అక్కడ గొడవలతోనూ, ఆ గొడవ పడే వాళ్ల తోనూ ఏం పనే..ఛఛ.. వాడై ఉండడు.. నేనిప్పుడే వెళ్లి విషయం కనుక్కొని వస్తాను.. ధైర్యంగా ఉండు..
రై.భా. – ఏవయ్యా.. నేనొక్క దాన్నీ ఉండ లేను.. ఉంటే ఆలోచనల్తో పిచ్చెక్కి పోతుంది.. నేనూ వస్తాను.. కాదనకయ్యా..
సన్నివేశం 6
(నగరంలో ప్రధాన కూడలి..ప్రతి పక్షం మనుషులు బలవంతంగా షాపులు మూయిస్తూ ఉంటే వెనక వచ్చిన అధికార పక్షం మనుషులు పోలీసుల సాయంతో తెరిపిస్తారు..ఈ విధంగా రెండు మూడు సార్లు జరుగుతుంది.. ఆటో ఒకటి వస్తుంది.. ఆందోళన కారులు దానిని ఆపేరు.. ఆటోలో ఒక వ్యక్తి దిగి ఆందోళన కారులను బ్రతిమాలుతూ ఉంటాడు..ఆందోళన కారులు అంగీకరించరు.. పోలీసులు వచ్చి ఆందోళన కారులను తరుముతారు..ఆటో దిగిన వ్యక్తి తిరిగి ఆటో దగ్గరకు వెళ్లి గొల్లుమంటాడు..)
(వన్ టి.వి. స్టూడియో.. సోది, బాకా, కసి కూర్చొంటారు..)
సోది – చెప్పండి కనకరాజు గారూ.. మీ ఉద్యమం విజయవంతమైందా..
కసి – నిస్సందేహంగా.. పోతే, మా పాలపొంగు ఉద్యమం ద్వారా పాలధర పెంపుకై మా నిరసనను ప్రభుత్వం దృష్టికి తేవడంలో సఫలీకృతులమయ్యాము.. అందుచేత మా ఆందోళన పూర్తిగా విజయవంతమైంది..
బాకా – (మాట పూర్తి కాకుండా) ఇది అబద్దం.. ఉద్యమానికి ప్రజల మద్దతు కరువయింది.. కిరాయి మనషులతో మరి మమ అనిపించారు.. ప్రభుత్వంతోనే ప్రజలున్నారు..
కసి – (మాట పూర్తి కాకుండా) నరం లేని నాలిక .. ఇష్టం వచ్చినట్టు మాట్లాడ కూడదు.. పోతే, పైరింగ్ లో ఆందోళన కారుని మృతిని ఖండిస్తూ మేమిచ్చిన బంద్ కాల్ కు కూడూ ప్రజలనుంచి అనూహ్య స్పందన వచ్చింది.. ప్రజలు స్వచ్చందంగా బంద్ లో పాల్గొన్నారు..
బాకా – లేదండీ..కిరాయి గుండాల సాయంతో తెరిచిన షాపులు మూసివేయించారు..
కసి – పోలీసుల సాయంతో షాపులు తెరిపించాలని ప్రభుత్వం విఫల యత్నం చేసింది..
సోది – కనకరాజు గారూ.. మీ భవిషత్ ప్రణాళిక ఏమిటి..
కసి – మా ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లగలిగాం..ప్రభుత్వానికి ప్రజల నిరసన తెలిసి వచ్చింది.. మా ప్రయత్నం సఫల మైంది కాబట్టి ఇంతటితో మేము మా ఉద్యమాన్ని విరమిస్తున్నాము..
బాకా – ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన పాలపొంగు ఉద్యమానికి ప్రజల మద్దతు లేక పోవడంతో ఉపసంహరించు కోవలసి వచ్చింది.. ఉద్యమ స్ఫూర్తి నీరు కారి పోయింది.. పాలపొంగు, పాల పొంగు లానే అణగారింది..
సోది – పాలక ప్రతి పక్షాలు పాలపొంగు ఉద్యమం పై పరస్పర విరుధ్దమైన ప్రకటనలు చేస్తున్నారు.. ఐతే ప్రభుత్వం మెట్టు దిగి వచ్చేటట్టు లేదు… కానీ ప్రతి పక్షం తమ నిరసన వినిపించామని, వారి ఉద్దేశంతో నెరవేరిందని అంటున్నారు … ఇదీ ఈ రోజు సోది తో శుభోదయం.. రేపు మరో చర్చతో మీ ముందు ఉంటాం.. అంత వరకు శలవు..
(నాలుగు రోడ్ల కూడలిలో కొడుకు శవం దగ్గల రైతు, రైతు భార్య విలపిస్తున్నారు..)
రై.భా. – చూడవయ్యా.. మన వాడికి అప్పుడే నూరేళ్లూ నిండిపోయాయి..మన కడుపులో చిచ్చు పెట్టి పోయాడు..
రైతు – ఒరేయి బాబూ..ఎంత పని జరిగిందిరా..రెండు కేకలేస్తే నువ్వుదారికొస్తావనుకున్నాను కానీ ఇంత పని జరుగుతుందనుకోలేదురా..
రై.భా. – ఒరేయ్ నాయనా.. నువ్వు లేకుండా నేనేలా బ్రతక గలనురా.. పెళ్లి చేసి ఇంట్లో కోడలు తిరుగుతూ ఉంటే చూడాలనుకున్నానురా..ఈ కడుపుకోత నేను భరించ లేనయ్యా..
రైతు నువ్వు గుండెలు పగిలే అవిసేలా ఏడిస్తే మాత్ర ఏ ప్రయోజనం.. అయ్యా.. మా గుండె కోత ఎవరు తీరుస్తారయ్యా. వాళ్ల పబ్బం గడుపుకోడానికి ఉద్యమం చేసిన ప్రతిపక్షం వారా..లేక వాళ్ల చర్యని సమర్ధించుకోడానకి వాడిని సంఘ వ్యతిరేక శక్తిగా ముద్ర వేసిన పాలక పక్షం వారా.. వాడు గూండా కాదు.. దాదాగిరీ చేయ లేదు.. వాడు రౌడీ షీటర్ కాదు.. వాడి మీద పోలీసు కేసులు లేవు.. పనికి మాలిన చదువు వెలగబెట్టి వళ్లు వంగక సోమరి తనంతో, నిర్వ్యాపకంగా తిరిగే కోట్లాది యువకులలో వీడూ ఒకడు.. తనకూ, మాకూ, దేశానికి ఏ మాత్రం ప్రయోజనం లేకుండా బ్రతుకు తున్నాడు కానీ ఎవ్వరీకీ హాని చేయలేదు.. నష్టం కలిగించ లేదు.. మీ చర్యని సమర్ధించుకునే ప్రయత్నంలో వాడిని నెప పెట్టవద్దు.. బాబూ.. ఈ ఉద్యమం ఎందుకు చేసారు.. ఏ ప్రయోజనం కోరి చేసారు.. ఈ ఉద్యమాలు స్విచ్ వేసిన విధంగా ఎవరో చెబితే ప్రారంభమవుతాయి.. స్విచ్ ఆర్పినట్టు ముగుస్తున్నాయి.. పాలపొంగు నిజంగా పాలపొంగే.. ఎంత వేగంగా ఎగజిమ్మిందో అంత వేగం గా చల్లారి పోయింది.. మరి ఈ పోయిన ప్రాణం మాటేమిటి..ప్రాణాలకు మీ దృష్టిలో విలువ లేదా..మా చెమటతో కట్టిన పన్నులతో చేకూరిన ప్రభుత్వ ఆస్తులను ఏ హక్కుతో ధ్వంసం చేస్తున్నారు.. మీరు తగలబెట్టిన ఆస్తులను ప్రభుత్వం తిరిగి సమకూర్చుకోడానికి మా గూబ వాయించి పన్ను కట్టించుకొంటుంది.. నేరం మీది శిక్ష మాకా..బందులకు హర్తాళ్లకు ఎందుకు పిలుపు నిస్తారు.. ఏ అధికారంతో పిలుపునిస్తున్నారు.. మీరు బందంటే రెక్కాడితేనే కాని డొక్కాడని ప్రజలు కడుపులో కాళ్లు ముడుచుకొని కూర్చోవాలి కదా..ఎంత మంది మీ బంద్ ల వలన ఇబ్బంది పడుతున్నారు..బంద్ తో పనిచేసే హక్కుని హరించి నట్లకదా.. మీ నిరసనలు ఇంత ఉధృతం గా, ఇంత హింసాయుతంగా సాగాలా.. ప్రజాస్వామ్యంలో మనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉన్ననాడు ఇంత రక్తపాతం ఎందుకు.. అహింసా నినాదంతో తెల్లవాళ్లని తరిమి గొట్టి స్వతంత్రులమయ్యామే..ఆ స్ఫూర్తి మనలో చచ్చిందా..ఉద్యమం హింసా మార్గంలో నడవగానే స్వాతంత్ర సమరాన్నే ఆపిన మహాత్మని ఆదర్శం మన నేటి రాజకీయ నాయకులలో కొరవడుతోందా..పరాయి పాలకులనే అహింసా వాదంతో ఎదుర్కొన్న మనం మరి మనం ఎన్నుకొన్న పాలకులతో వ్యవ్హరించే తీరిదా.. నిరసన ప్రజలలోంచి రావాలి.. అది ప్రజా ఉద్యమం.., రాజకీయ నాయకులు స్వప్రయోజానలకోసం, వారి ఉనికి చాటుకోసం ప్రజలను రెచ్చగొట్టి లేని ఆలోచనలు లేపి నడిపే ఉద్యమాలు ప్రజలకు చేటు చేస్తాయే కాని మంచి చేయవు. మాకోసం అని చెప్పి, మాలో లేని భయాలు, భావాలు రేపే ఉద్యమాలు మాకొద్దు.. మా బ్రతుకు మమ్మల్ని బ్రతక నీయండి..అదే మీరు మాకు చేసే మహోపకారం..
(కొడుకు శవాన్ని చేతిలోకి తీసుకొని రైతు, వెనకగా భార్య నడుస్తూ ఉంటారు..)
తెర వాలుతుంది..

While By elections are reaching in no time, the main parties are facing lot of troubles. The smooth sailing TDP Party is facing some issues recently as vallabhaneni vamshi and Jr NTR s Heat. Congress has to work hard to face the YSR Congress Party. The main Agenda of YSR Congress Party is Jagan C.M Post and to demolish congress party reputation over Andhra Pradesh. Even Chandra Babu Naidu is not giving up the By Elections even though he knows that the by elections is not for TDP. Just To make sure that the blossoms of his party he is trying to win few seats. But sadly some issues are going on TDP Party with Vallabhaneni Vamshi. Sources say that the man behind Vallabhaneni Vamshi is Jr NTR. So Let’s see How These Issues will Damage the reputation of main parties in the coming elections.

Tags: , ,